Meenakshi temple: కృష్ణాష్టమి వేళ సినీ నటి నమితకు దేవాలయంలో చేదు అనుభవం
- మధుర మీనాక్షి ఆలయంలో నమితను అడ్డుకున్న సిబ్బంది
- హిందువు అని నిరూపించే సర్టిఫికెట్స్ చూపించమని డిమాండ్
- ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీడియో విడుదల చేసిన నమిత
- ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదంటూ ఆలయ అధికారుల వివరణ
కృష్ణాష్టమి వేళ సినీ నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నటి నమిత కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లగా, ఆమెను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తనకు జరిగిన అవమానంపై నటి నమిత వీడియో విడుదల చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నేను హిందువునే అని నిరూపించే సర్టిఫికెట్స్ చూపించమన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను తాను సందర్శించినట్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని నమిత చెప్పుకొచ్చింది.
నమిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోండటంతో ఆలయ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. నమితతో ఎవరూ అమర్యాదగా ప్రవర్తించలేదని, ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడామన్నారు. పై అధికారులు చెప్పడంతో కొంతసేపు ఆగమని చెప్పామని, తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించామని వివరణ ఇచ్చారు.