Telangana: సీఎం కుటుంబ సభ్యులే మాపై దాడులు చేస్తున్నారు: తెలంగాణ జర్నలిస్టుల ఆగ్రహం

Journalists fires at Telangana Government

  • రాహుల్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు
  • గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని మండిపాటు
  • రాహుల్ గాంధీకి వినతి పత్రం ఇస్తామంటే అనుమతించలేదన్న జర్నలిస్టులు

తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన వారిలో జర్నలిస్ట్ శంకర్, వీణవంక ప్రభాకర్, సుంకరి ప్రవీణ్, లింగస్వామి ఉన్నారు. రాష్ట్రంలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయన్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతామని చెబుతారని, కానీ రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవన్నారు. రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని, కానీ అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందు నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

జర్నలిస్టులం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం లేదని, అలా చేస్తే తమపై కేసులు పెట్టుకోవచ్చునన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదన్నారు. 

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేసేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాము ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News