Virat Kohli: ధావన్.. భారత్‌కు అత్యంత విశ్వసనీయ ఓపెనర్: విరాట్ కోహ్లీ
- ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శిఖర్ ధావన్
- 2010 నుంచి 2022 వరకు టీమిండియాకు గబ్బర్ ప్రాతినిధ్యం
- అతడి వీడ్కోలుపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న సహచర ఆటగాళ్లు
- ఈ నేపథ్యంలోనే తాజాగా విరాట్ కోహ్లీ ట్వీట్
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గబ్బర్ ప్రకటించాడు. ఓపెనర్‌గా ఒక దశాబ్దం పాటు (2010 నుంచి 2022 వరకు) భారత జట్టుకు ఆడాడు. అనేక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ఈ నేపథ్యంలో అతడి వీడ్కోలుపై సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఈ సందర్భంగా ధావన్‌తో ఉన్న తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా గబ్బర్ రిటైర్మెంట్‌పై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించాడు. భారత జట్టుకు అత్యంత విశ్వసనీయ ఓపెనర్లలో శిఖర్ ధావన్ ఒకడని విరాట్ పేర్కొన్నాడు.
"నిర్భీతితో కూడిన అరంగేట్రం నుంచి భారత్‌కు అత్యంత విశ్వసనీయ ఓపెనర్‌లలో ఒకడిగా మారడం వరకు మాకు ఎన్నో మధురానుభూతులు మిగిల్చావు. క్రికెట్ పట్ల నీ క్రీడాస్ఫూర్తి, అభిరుచి, చిరునవ్వుకు మేం దూరమవుతాం. కానీ నీ వారసత్వం మాత్రం కొనసాగుతుంది.
మధురానుభూతులు, మరిచిపోలేని ప్రదర్శనలు అందించావు. సహృదయంతో ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు. మైదానం వెలుపలి గబ్బర్‌కు తర్వాతి ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు" అని విరాట్ ట్వీట్ చేశాడు.