Nagarjuna: మరోసారి చెబుతున్నా... ఎన్ కన్వెన్షన్ ను పట్టా భూమిలోనే నిర్మించాం: నాగార్జున
- హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన రేవంత్ రెడ్డి సర్కారు
- హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న నాగార్జున
- ఒక్క సెంటు భూమిని కూడా ఆక్రమించలేదని తాజాగా ట్వీట్
- పుకార్లు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున మరోసారి స్పందించారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని , అక్రమ నిర్మాణం చేపట్టలేదని పునరుద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
"ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు... సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే చాలు... వాటికి అతిశయోక్తులు జోడిస్తుంటారు, మరింత ప్రభావవంతంగా ఉండేందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తారు. మరోసారి చెబుతున్నా... ఎన్ కన్వెన్షన్ ను పట్టా భూమిలోనే నిర్మించాం. అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అది. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు.
తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్.3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం.
నేను భూ చట్టానికి, తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు, వాస్తవాల వక్రీకరణ, తప్పుదారి పట్టించడం వంటి చర్యల జోలికి వెళ్లొద్దని మిమ్మల్నందరినీ హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.