CPI Narayana: నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించారు: సీపీఐ నారాయణ
- నిన్న ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
- నేడు ఎన్-కన్వెన్షన్ కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించిన నారాయణ
- ఎన్-కన్వెన్షన్ ద్వారా రోజుకు రూ.1 లక్ష ఆదాయం వస్తుందని వెల్లడి
హైదరాబాదులో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను నిన్న హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
నారాయణ ఇవాళ హైదరాబాదులో ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించారని ఆరోపించారు. ఎన్-కన్వెన్షన్ సెంటర్ ద్వారా రోజుకు రూ.1 లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు.
మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారని నారాయణ ఆరోపించారు. చాలామంది చెరువులు, నాలాలు కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు.
అక్రమ నిర్మాణాల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఆరంభ శూరత్వంలా మిగిలిపోకూడదని, ఎవరు కబ్జా చేసినా కూలగొట్టాలని నారాయణ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.