Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... ఎందుకంటే?
- వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించి మార్పులు చేయాలనుకుంటున్న కేంద్రం
- వక్ఫ్ బోర్డ్ చట్టం అంశంపై చర్చించిన సీఎం, ఎంపీ
- సీఎంతో భేటీలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ సైఫుల్లా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిశారు. సీఎంను కలిసి వక్ఫ్ బోర్డు అంశంపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి మార్పులు చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మజ్లిస్ అధినేత సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో అసదుద్దీన్‌తో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ ఉన్నారు.
చట్టంలో మార్పులు సరికాదన్న రాఘవులు
వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి మార్పులు చేయాలనుకోవడం అభ్యంతరకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముందనే స్పృహలేకుండా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మతతత్వ ఆలోచనలతోనే ఇంకా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక మతానికి సంబంధించిన అంశంలో మరో మతస్తులు ఉండవద్దని బీజేపీ నేతలే చెబుతున్నారని, కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతర మతస్తులను చేర్చి నియంత్రించాలనుకోవడం విడ్డూరమన్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.
భూములను నియంత్రించడమే వక్ఫ్ బోర్డ్ పని అన్నారు. వాటి మీద ప్రభుత్వం నియంత్రించడానికి పూనుకోవడం సరికాదన్నారు. అవినీతిపై ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని సూచించారు. హర్యానా, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని, దుర్బుద్ధితో మత విభజనను సృష్టించి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్‌లో లోపాలుంటే సవరించుకోవచ్చని, కానీ కమ్యూనల్ సివిల్ కోడ్ అనడం ద్వారా ప్రధాని మోదీ మత దురభిప్రాయాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. కిందిస్థాయి వ్యక్తుల మాటలు అర్థం చేసుకోవచ్చునని... కానీ ప్రధాని హోదాకు తగినట్లుగా ఆయన మాట్లాడటం లేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపాల్సిన వ్యక్తి చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.