KTR: కేటీఆర్‌కు రాఖీ కట్టిన సభ్యులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం

Telangana Women Commission Condemns Inappropriate Conduct by Commission Members

  • ఆరుగురు సభ్యులు అనుచిత చర్యకు పాల్పడ్డారన్న చైర్ పర్సన్ నేరెళ్ల శారద
  • కమిషన్ తటస్థతను ప్రశ్నించేలా లేదా కార్యకలాపాలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్య
  • రాఖీ కట్టిన సభ్యులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వెల్లడి

మహిళా కమిషన్ ఎదుట హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. మహిళా కమిషన్ సభ్యుల తీరును తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఖండించారు. ఆరుగురు సభ్యులు కేటీఆర్‌కు రాఖీ కట్టి అనుచిత చర్యకు పాల్పడినట్లుగా మహిళా కమిషన్ దృష్టికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంతో ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారని ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా, నిష్పక్షపాతం, సంస్థ సమగ్రతను, విశ్వాసాన్ని నిలబెట్టడం అత్యవసరమన్నారు. కమిషన్ తటస్థతను ప్రశ్నించేలా లేదా అలాంటి కార్యకలాపాలు నిర్వహించడం ఆమోదయోగ్యం కాదన్నారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రవర్తన (కేటీఆర్‌కు రాఖీ కట్టడం) కమిషన్ సభ్యులకు తగదన్నారు. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసేలా వారు ప్రవర్తించారన్నారు. అక్కడ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేకపోయినప్పటికీ సీక్రెట్‌గా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి... రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో ప్రమేయం ఉన్న సభ్యులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాలని కమిషన్ కార్యదర్శిని ఆదేశించినట్లు చైర్ పర్సన్ తెలిపారు. మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిబద్ధత విషయంలో రాజీపడే వైఖరిని సహించేది లేదన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ న్యాయాన్ని నిలబెట్టడానికే ఉందన్నారు.

  • Loading...

More Telugu News