Amit Shah: నక్సలిజంపై పోరాటం చివరి దశకు చేరుకుంది: అమిత్ షా
- ఛత్తీస్ గఢ్ లో అంతర్రాష్ట్ర సమన్వయ భేటీ
- హాజరైన ఛత్తీస్ గఢ్ సీఎం, పొరుగు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలు
- 2026 నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కలుగుతుందన్న అమిత్ షా
ఛత్తీస్ గఢ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అంతర్రాష్ట్ర సమన్వయ భేటీ జరిగింది. ఈ కీలక సమావేశంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలు పాల్గొన్నారు.
ఈ భేటీలో అమిత్ షా మాట్లాడుతూ, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించామని వెల్లడించారు. దేశంలో నక్సలిజంపై పోరాటం చివరి దశకు చేరుకుందని తెలిపారు. 2026 నాటికి దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహంతో ముందుకెళుతున్నామని చెప్పారు.
నక్సలిజం వల్ల గత 10 సంవత్సరాలలో 6,617 మంది భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా వివరించారు. ఇటీవల కాలంలో భద్రతా సిబ్బంది, పౌరుల మరణాలు 70 శాతం వరకు తగ్గాయని అన్నారు.