Helicopter: ముంబయి నుంచి హైదరాబాద్ వస్తూ కూలిపోయిన హెలికాప్టర్

Helicopter crashed in Pune district enroute to Hyderabad from Mumbai

  • పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిన చాపర్
  • ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో నలుగురు వ్యక్తులు
  • పైలెట్ కు గాయాలు... ఆసుపత్రిలో చికిత్స
  • మిగిలిన ముగ్గురికీ ఏమీ కాలేదన్న జిల్లా ఎస్పీ

మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ సహా నలుగురు ఉన్నారు. 

సాధారణంగా హెలికాప్టర్, విమానాలు కూలిపోయిన ఘటనల్లో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అరుదైన విషయం. ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలెట్ కు గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు. గాయపడిన పైలెట్ ను ఆసుపత్రికి తరలించినట్టు పుణే జిల్లా ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. 

కాగా, కూలిపోయిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేటు విమానయాన కంపెనీకి చెందినది. ఇది అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ-139 రకానికి చెందిన హెలికాప్టర్. రెండు ఇంజిన్లు ఉండే ఈ చాపర్ లో 8 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. 

ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరపనుంది.

  • Loading...

More Telugu News