Nagarjuna Akkineni: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత‌పై నాగార్జున ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌... ఏమ‌న్నారంటే..!

Nagarjuna Akkineni Tweet on N Convention Demolition

  • స్టే ఆర్డ‌ర్‌లు, కోర్టు కేసుల‌కు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేశారన్న నాగ్‌
  • చ‌ట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టలేద‌ని వెల్ల‌డి
  • ఆ భూమి ప‌ట్టా భూమి అని పేర్కొన్న నాగార్జున‌
  • కూల్చివేత‌కు ముందు త‌మ‌కు ఎలాంటి నోటీసు జారీ చేయ‌లేద‌న్న నాగ్‌

హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) అధికారులు ఇవాళ ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ కూల్చివేత‌పై తాజాగా నాగార్జున స్పందించారు. దీనిపై ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఓ ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

స్టే ఆర్డ‌ర్‌లు, కోర్టు కేసుల‌కు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలు చేప‌ట్టడం బాధాక‌రం అని పేర్కొన్నారు. త‌మ ప్ర‌తిష్ట‌ను కాపాడ‌టం కోసం, కొన్ని వాస్త‌వాల‌ను తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ట్లు నాగ్ పేర్కొన్నారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టలేద‌ని స్పష్టం చేశారు.

ఆ భూమి ప‌ట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని తెలిపారు. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ ప్రైవేట్ స్థ‌లంలో నిర్మించిన భ‌వ‌నం అని తెలిపారు. కూల్చివేత కోసం గ‌తంలో ఇచ్చిన అక్ర‌మ నోటీసుపై స్టే కూడా మంజూరైన‌ట్లు వివరించారు.

స్ప‌ష్టంగా చెప్పాలంటే కూల్చివేత‌ త‌ప్పుడు స‌మాచారంతో, చ‌ట్ట విరుద్ధంగా జ‌రిగింద‌ని ఆరోపించారు. ఈరోజు ఉద‌యం కూల్చివేత‌కు ముందు త‌మ‌కు ఎలాంటి నోటీసు జారీ చేయ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసు కోర్టులో ఉన్న‌ప్పుడు ఇలా చేయ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. కోర్టు త‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు ఇస్తే... చ‌ట్టాన్ని గౌర‌వించే పౌరుడిగా, తానే స్వ‌యంగా కూల్చివేత నిర్వ‌హించి ఉండేవాడిన‌ని నాగార్జున తెలిపారు. 

తాజా ప‌రిణామాల వ‌ల్ల తామే ఆక్ర‌మ‌ణ‌లు చేశామ‌ని, త‌ప్పుడు నిర్మాణాలు చేప‌ట్టామ‌ని ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ్లే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాల‌నేదే త‌మ‌ ఉద్దేశం అని పేర్కొన్నారు. అధికారులు చేసిన ఈ చ‌ట్ట విరుద్ధ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా తాము న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అక్క‌డ త‌మ‌కు త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నామ‌ని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News