RBI: విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్.. రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం.. అది మీరే కావొచ్చు!

RBIs quiz for college students offers a chance to win Rs10 lakh

  • ఇటీవలే 90 ఏళ్లు పూర్తిచేసుకున్న భారతీయ రిజర్వు బ్యాంకు
  • ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ పేరుతో పోటీలు
  • ఎంట్రీ ఉచితం.. సెప్టెంబర్ 17 వరకు నమోదుకు గడువు
  • కనీసం లక్ష రూపాయలు కూడా గెలుచుకునే అవకాశం

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థుల కోసం ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ను ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 10 లక్షల బహుమతి గెలుచుకోవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పోటీ కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్‌ను ఎంపిక చేస్తారు. వారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోటీపడాల్సి ఉంటుంది. అక్కడ గెలిచిన వారికి రూ. 10 లక్షల బహుమతి అందిస్తారు. 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల 20న ఈ క్విజ్‌ను ప్రారంభిస్తూ విద్యార్థుల నుంచి ఎంట్రీలు ఆహ్వానించారు. ఆర్థిక ప్రపంచంలో విద్యార్థులు తమ జ్ఞానాన్ని నిరూపించుకోవడం, ఆర్థిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన పెంచడం, డిజిటల్ ఫైనాన్స్‌ను సురక్షితంగా, బాధ్యాయుతంగా వినియోగించడంపై వారిని ప్రోత్సహించడం ఈ క్విజ్ ఉద్దేశం. 

ఎవరికి ఎంత బహుమతి?
జాతీయ స్థాయి విజేతకు రూ. 10 లక్షలు ప్రథమ బహుమతిగా లభిస్తాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ. 8 లక్షలు, రూ. 6 లక్షలు అందిస్తారు. జోనల్ స్థాయిలో తొలి ముగ్గురు విజేతలకు రూ. 5 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 3 లక్షలు అందిస్తారు. రాష్ట్రస్థాయిలో ఈ బహుమతి వరుసగా రూ. రూ. 2 లక్షలు, రూ. 1.5 లక్షలు, రూ. లక్షగా  ఉంటుంది. 

ఎలా పాల్గొనాలి?
25 ఏళ్లు నిండని (1 సెప్టెంబర్ 1999 తర్వాత జన్మించిన వారు) వారు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. కాకపోతే దేశంలో ఎక్కడైనా సరే కాలేజీలో చదువుతూ ఉండాలి. ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతాయి.

అడిగే ప్రశ్నలు ఇవే
కరెంట్ అఫైర్స్, చరిత్ర, సాహిత్యం, క్రీడలు, ఆర్థికం, జనరల్ నాలెడ్జ్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. తమ తెలివితేటలను ప్రదర్శించడంతోపాటు డబ్బులు కూడా గెలుచుకునే అవకాశం ఉన్న ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ మీ కోసమే. మరెందుకు ఆలస్యం.. వెంటనే మీ ఎంట్రీని కూడా పంపండి. లక్షల రూపాయలు గెలచుకోండి.

  • Loading...

More Telugu News