lung cancer: లంగ్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ సిద్ధం.. రోగులపై మొదలైన ట్రయల్స్!

lung cancer vaccine tested on uk patient

  • ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి తొలి వ్యాక్సిన్ అందజేత
  • BNT116 పేరిట వ్యాక్సిన్ రూపొందించిన బ్రిటన్ పరిశోధకుల బృందం 
  • కీమో కంటే చాలా బెటర్ చికిత్స అంటున్న వైద్యులు

ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమైన వ్యాధుల్లో కేన్సర్ ముందు వరుసలో ఉంది. వీటిలో ఊపిరితిత్తుల కేన్సర్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏటా 1.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం టీకా (వ్యాక్సిన్) రూపొందించింది. BNT116  పేరిట రూపొందించిన టీకాను శుక్రవారం యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ప్రయోగించారు. కోటి ఆశలతో వ్యాక్సిన్ పని తీరును పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతం అయితే వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. 
 
ఈ వ్యాక్సిన్ ను బయోఎన్‌టెక్ కంపెనీ రూపొందించగా, జానస్జ్ రాక్జ్‌కు జబ్  (67) అనే ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆరు సిరంజీల వ్యాక్సిన్ ను శుక్రవారం ఇచ్చారు. ఈ సందర్భంగా తొలి వ్యాక్సిన్ వేయించుకున్న జానస్జ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం సక్సెస్ అయితే తనలా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న వందలాది మందికి ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ ప్రయోగంలో తాను మొదటి వ్యక్తినా? లేక వందో వ్యక్తినా? అనే విషయంలో తనకు పట్టింపు లేదని అన్నారు. ఇది సహాయపడుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. వ్యాక్సిన్ వేగంగా ఉత్పత్తికి వెళితే ఇతర రోగుల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. 

కీమోథెరఫీ కంటే చాలా కచ్చితత్వంతో ఇది పని చేస్తుందని యూనివర్శిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన కణాలపై ఏ విధమైన నష్టాన్ని కలిగించదని స్పష్టం చేశారు. నొప్పి లేకుండా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఇది కీమో కంటే చాలా బెటర్ చికిత్స అని వెల్లడించారు. రోగి శరీరంలోని క్యాన్సర్ కణితులను గుర్తించి వాటిపై పోరాడటానికి రోగ నిరోధక వ్యవస్థలకు శిక్షణ ఇస్తుందని, ఇది రోగ నిరోధక ప్రతిస్పందనలను అణచివేసే కణాలను సమర్ధవంతంగా తొలగించగలుగుతుందని వైద్యులు వెల్లడించారు. రోగులపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఇంకా అమెరికా, జర్మనీ, హంగేరీ, పోలెండ్, టర్కీ, స్పెయిన్ దేశాలలో కూడా మొదలయ్యాయి.  

  • Loading...

More Telugu News