Nara Lokesh: అపోహలకు గురిచేసే ప్రశ్నలు అడగొద్దు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh reviews on Skill Census Survey

  • ఏపీలో అధికారంలోకి వస్తే స్కిల్ సెన్సస్ చేపడతామన్న కూటమి
  • నైపుణ్య గణనపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
  • మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా నైపుణ్య గణన సర్వే

ఏపీలో అధికారంలోకి వస్తే నైపుణ్య గణన చేపడతామన్నది కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటి. ఈ హామీపై మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. నైపుణ్య గణన సర్వేపై ఇవాళ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని అన్నారు. నైపుణ్య గణన సర్వేలో ఈ రెండు అంశాలపైనే ప్రశ్నలు అడగాలని, అంతేతప్ప, అపోహలు కలిగించేలా ప్రశ్నలు ఉండకూడదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. నైపుణ్య గణన సర్వేపై తొలుత మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. 

యువత విద్యార్హతలు, ఉద్యోగ ఉపాధి, నైపుణ్యాలతో కూడిన ఒక ప్రత్యేక రెజ్యూమేను ప్రభుత్వమే తయారు చేసేందుకే అవసరమైన సమాచారాన్ని సర్వే ద్వారా సేకరించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలను మెరుగుపర్చుకునే కొద్దీ, ఈ రెజ్యూమేను అప్ డేట్ చేస్తుండాలని పేర్కొన్నారు. ఈ డేటాను పరిశీలించేందుకు ప్రముఖ కంపెనీలకు అనుమతి ఇస్తామని, దాంతో, తమ అవసరాలకు తగిన అభ్యర్థులను ఆయా కంపెనీలు నేరుగా ఎంపిక చేసుకుంటాయని లోకేశ్ వివరించారు. ఓవరాల్ గా నైపుణ్య గణన వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News