Anil Ambani: అనిల్ అంబానీపై సెబీ వేటు.. ఐదేళ్ల‌ నిషేధంతో పాటు రూ.25 కోట్ల జరిమానా!

SEBI bars Anil Ambani from capital markets for five years
  • నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్ప‌ష్టీక‌ర‌ణ‌ 
  • ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు సహా మరో 27 సంస్థలపైనా బ్యాన్‌
  • రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌పై కూడా ఆర్నెల్ల పాటు నిషేధం
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ స్టాక్‌మార్కెట్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ ఐదేళ్ల‌ పాటు నిషేధం విధించింది. 'రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు సహా, మరో 27 సంస్థలపైనా నిషేధం విధిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ వాచ్‌డాగ్ స్ప‌ష్టం చేసింది.

రూ.25 కోట్ల భారీ జరిమానా
అనిల్‌ అంబానీపై సెబీ రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్‌ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్‌ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండకూడదని ఆదేశించింది. 

మరోవైపు రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెల్ల పాటు నిషేధించింది. పైగా రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది. ఆర్డర్ అందిన 45 రోజుల్లోగా ఈ పెనాల్టీని చెల్లించాలని మార్కెట్ వాచ్‌డాగ్ ఆదేశించింది.  

కాగా, ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌ తన వ్యాపారంలో భాగంగా గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు, నిర్మాణ ఫైనాన్స్ మొదలైనవాటిని అందిస్తుందనే విష‌యం తెలిసిందే. అటు రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఈ ఆదేశాలు వెలువ‌డిన వెంటనే లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రిలయన్స్ పవర్ షేర్లు ఇంట్రాడేలో రూ.34.48 కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
Anil Ambani
SEBI
Capital Markets

More Telugu News