Narendra Modi: రైల్లో ఉక్రెయిన్ కు చేరుకున్న ప్రధాని మోదీ.. అత్యంత గోప్యంగా పర్యటన వివరాలు!

PM Modi reaches Ukraine

  • పోలండ్ నుంచి ఉక్రెయిన్ కు చేరుకున్న మోదీ
  • 10 గంటల పాటు రైల్లో ప్రయాణించిన ప్రధాని
  • భద్రతా కారణాల వల్ల మోదీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచిన ఉక్రెయిన్
  • కీలక చర్చలు జరపనున్న మోదీ, జెలెన్ స్కీ
  • దాదాపు 7 గంటల సేపు కొనసాగనున్న మోదీ పర్యటన

దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ లో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక పర్యటన మొదలైంది. పోలండ్ పర్యటనను ముగించుకున్న మోదీ... అక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు రైల్లో చేరుకున్నారు. రైల్ ఫోర్స్ వన్ రైల్లో దాదాపు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్ లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు.

కీవ్ లోని రైల్వే స్టేషన్ లో మన జాతీయ జెండాలతో భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని ఇస్కాన్ బృందం కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొంది. భద్రతా కారణాల కారణంగా మోదీ పర్యటనలోని కార్యక్రమాల వివరాలను గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మోదీ కీవ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆయన కాన్వాయ్ మోదీ బస చేసే హయత్ హోటల్ కు చేరుకుంది. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. 

ఉక్రెయిన్ లో మోదీ పర్యటన దాదాపు ఏడు గంటల పాటు జరగనుంది. తన పర్యటనలో భాగంగా కీవ్ లోని ఏవీ ఫొమిన్ బొటానికల్ గార్డెన్ లో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి నివాళి అర్పిస్తారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను మోదీ సందర్శించనున్నారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లను మ్యూజియంలో ఆయన వీక్షించనున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఇక్కడ మోదీ నివాళి అర్పించనున్నారు. 

అనంతరం మరిన్ స్కీ ప్యాలెస్ కు మోదీ వెళ్తారు. అక్కడ మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలుకుతారు. ఈ ప్యాలస్ లో ఇద్దరూ కలిసి ప్రైవేట్ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చలు జరుపుతారు.

Narendra Modi
India
Volodymyr Zelensky
Ukraine
  • Loading...

More Telugu News