Lord Hanuman: టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది.. వీడియో ఇదిగో!
- ఆగస్టు 15 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం
- శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ
- భారతదేశం ఆవల అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహంగా రికార్డు
అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. టెక్సాస్‌లో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కాగా, అమెరికాలో మూడోది. దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ (ఐక్యతా విగ్రహం) అని పేరు పెట్టారు. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది పేరు సంపాదించుకుంది. న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (151 అడుగులు), ఫ్లోరిడాలోని హలాండలే బీచ్‌లో ఉన్న పెగాసస్ అండ్ డ్రాగన్ (110 అడుగులు) విగ్రహాల సరసన మన హనుమాన్ విగ్రహం చేరింది. అంతేకాదు, భారతదేశం ఆవల అతిపెద్ద హనుమంతుడి విగ్రహం గానూ ఇది రికార్డులకెక్కింది.
టెక్సాస్ సుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ నెల 15 నుంచి 18 మధ్య అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఈ స్టాట్యూ ఆఫ్ యూనియన్ హనుమాన్ మారుతి విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో పైనుంచి భక్తులపై పూలు, పవిత్ర జలాన్ని చల్లారు. అలాగే 72 అడుగుల దండను విగ్రహం మెడలో వేశారు.