Lausanne Diamond League: నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శన.. లుసానే డైమండ్ లీగ్‌లో రెండో స్థానం
![Neeraj Chopra finishes 2nd in Lausanne Diamond League qualifies for final](https://imgd.ap7am.com/thumbnail/cr-20240823tn66c7fa4109453.jpg)
- బల్లెంను 89.49 మీటర్లు విసిరిన నీరజ్
- 90.61 మీటర్ల త్రోతో విజేతగా నిలిచిన అండర్సన్ పీటర్స్
- మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా జూలియన్ వెబర్, ఆర్తుర్ ఫెల్ఫ్నర్
పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా గురువారం జరిగిన లుసానే డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. తన ఆఖరి ప్రయత్నంలో బల్లెంను 89.49 మీటర్లు విసిరాడు. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 88.37 మీటర్లు, ఉక్రెయిన్ ఆటగాడు ఆర్తుర్ ఫెల్ఫ్నర్ 83.38 మీటర్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు.
కాగా, ఇది ఈ సీజన్లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అతను జావెలిన్‌ను 89.45 మీటర్లు త్రో చేసిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శనతో వచ్చే నెల బ్రస్సెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్ 2024 ఫైనల్‌కు అర్హత సాధించాడు.
ఇక పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా వరుస ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ ఫీట్‌ను రెజ్లర్ సుశీల్ కుమార్ (2008, 2012), పీవీ సింధు (2016, 2020) సాధించారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.