Sanjay Roy: ఎమోషన్స్ లేవు... సంజయ్ రాయ్ మనిషి కాదు... మృగం!... దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు

CBI Psycho analysts shocked after what Sanjay Roy said


కోల్ కతా అత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి, అనంతరం హత్యకు పాల్పడిన నేపథ్యంలో, సంజయ్ రాయ్ మానసిక స్థితిని అంచనా వేయడానికి సీబీఐ కొందరు మానసిక విశ్లేషకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. 

సంజయ్ రాయ్ ను ప్రశ్నించిన ఆ టీమ్ దిగ్భ్రాంతికి గురైంది. అన్ని కోణాల్లో ప్రశ్నించిన తర్వాత అతడొక 'కామ పిశాచి' అని, జంతు ప్రవృత్తితో విచ్చలవిడిగా తయారయ్యాడని తేల్చారు. పోర్న్ వీడియోలకు బానిసై, కామోన్మాదం బాగా తలకెక్కిన స్థితిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు. 

సెమినార్ హాల్లోకి ప్రవేశించడం దగ్గర్నుంచి, జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆమెను చంపేయడం వరకు పూసగుచ్చినట్టు సంజయ్ రాయ్ చెబుతుండడం చూసి ఆ మానసిక నిపుణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా, అత్యాచారం ఎలా చేసిందీ చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేకపోగా, అదేదో సాధారణమైన చర్య అయినట్టు అతడు జరిగింది జరిగినట్టు చెప్పడం సీబీఐ బృందాన్ని నివ్వెరపరిచింది. 

సీబీఐ సేకరించిన వివరాల ప్రకారం... ఇతర జూనియర్ డాక్టర్లతో కలిసి రాత్రి భోజనం చేసిన ట్రైనీ డాక్టర్ రాత్రి ఒంటి గంట సమయంలో సెమినార్ హాల్ కు తిరిగొచ్చింది. రాత్రి 2.30 గంటల సమయంలో మరో జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ కు రాగా, అతడితో ఒకట్రెండు మాటలు మాట్లాడి తిరిగి నిద్రపోయింది. 

కాగా, సంజయ్ రాయ్ వేకువ జామున 4 గంటల సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అనంతరం, మూడో ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్లోకి వెళ్లి, నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడ్డాడు.

More Telugu News