Cristiano Ronaldo: యూట్యూబ్‌లో సాక‌ర్ వీరుడి సంచ‌ల‌నం... రొనాల్డో ఛానెల్‌కు 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు!

Cristiano Ronaldo Launches YouTube Channel Gains 1M Subscribers In 90 Minutes

  • UR · Cristiano పేరిట క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానెల్ 
  • ఛానెల్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే 11 మిలియన్ కంటే ఎక్కువ మంది స‌బ్‌స్క్రయిబర్లు
  • దీంతో ఫస్ట్ డేనే 'గోల్డెన్ ప్లే' బటన్ కైవ‌సం

పోర్చుగల్ సాక‌ర్ లెజెండరీ ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ సాక‌ర్ వీరుడు బుధవారం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అయితే ఈ ఛానెల్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది రొనాల్డో ఛానెల్‌ను సబ్‌ స్క్రయిబ్ చేసుకున్నారు. దీంతో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు.

ఈ మాజీ రియల్ మాడ్రిడ్ లెజెండ్ ఇప్పుడు 11 మిలియన్ కంటే ఎక్కువ మంది స‌బ్‌స్క్రయిబర్లను కలిగి ఉన్నాడు. ఛానెల్‌ ప్రారంభించిన 24 గంటల కంటే తక్కువ స‌మ‌యంలోనే ఇంత‌మంది నెటిజ‌న్లు సబ్‌స్క్రయిబ్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో యూట్యూబ్ మేనేజ్మెంట్ రొనాల్డోకు 'గోల్డెన్ ప్లే' బటన్ అందించింది. అలా ఛానెల్ ప్రారంభించిన రోజే రొనాల్డో 'గోల్డెన్ ప్లే' అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నాడు.  

ఇక రొనాల్డో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం తాలూకు ప్ర‌క‌ట‌న చేశాడు. "నిరీక్షణ ముగిసింది. నా @YouTube ఛానెల్ వ‌చ్చేసింది! ఈ కొత్త ప్రయాణంలో నా యూట్యూబ్ ఛానెల్ (UR · Cristiano) సబ్‌స్క్రయిబ్ చేసుకోండి. నాతో చేరండి" అని రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. 

కాగా, ఈ ఫుట్ బాల్ లెజెండరీకి ఎక్స్ (ట్విట్టర్)లో 112.5 మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 636 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

కాగా, 39 ఏళ్ల రొనాల్డో తన అద్భుతమైన ఫిట్‌నెస్ కార‌ణంగా ఇప్ప‌టికీ సాక‌ర్ ఆట‌లో దూసుకెళ్తున్నాడు. ఇక అంతర్జాతీయ వేదికపై అతను చివరిసారిగా జర్మనీలో జరిగిన యూరో 2024 టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. రొనాల్డో ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్‌కు సిద్ధమవుతున్నాడు. గురువారం అల్-రేడ్‌తో రొనాల్డో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ అల్-నాస్ర్ త‌ల‌ప‌డ‌నుంది.

  • Loading...

More Telugu News