Rishab Shetty: బాలీవుడ్ పై జాతీయ ఉత్తమ నటుడి విమర్శలు
- మన దేశాన్ని బాలీవుడ్ సినిమాలు నెగెటివ్ గా చూపిస్తున్నాయన్న రిషబ్ శెట్టి
- అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రాలు చోటు దక్కించుకోవడం శోచనీయమని వ్యాఖ్య
- తనకు తన దేశం, రాష్ట్రం, భాష ముఖ్యమన్న రిషబ్
రెండేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా విడుదలైన 'కాంతార' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టిని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. ఇప్పుడు ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ తరుణంలో బాలీవుడ్ పై రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ సినిమాలు మన దేశాన్ని నెగెటివ్ గా చూపిస్తున్నాయని రిషబ్ శెట్టి విమర్శించారు. మన దేశాన్ని నెగెటివ్ గా చూసిస్తున్న అలాంటి సినిమాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయమని చెప్పారు. తన వరకైతే తన దేశం, తన రాష్ట్రం, తన భాష చాలా ముఖ్యమని... వీటిని చూసి గర్వంగా ఫీల్ అవుతుంటానని అన్నారు.
రిషబ్ శెట్టి వ్యాఖ్యలపై నెటిజెన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. బాలీవుడ్ ఎప్పటి నుంచో అలాంటి సినిమాలనే ఎక్కువగా తీస్తోందని ఒకరు వ్యాఖ్యానించారు. నీ సినిమాల్లో ఆశ్లీలత లేనట్టే మాట్లాడుతున్నావని మరికొందరు ఎద్దేవా చేశారు. 'కాంతార' సినిమాలో హీరోయిన్ నడుము గిల్లడం తప్పుకాదా? అని కొందరు ప్రశ్నించారు. ఈ వివాదాన్ని పక్కన పెడితే రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార' సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు.