Rohit Sharma: సియట్ క్రికెట్ అవార్డ్స్ 2024.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రోహిత్ శ‌ర్మ‌

Indian captain Rohit Sharma awarded the Men International Cricketer of the Year at the CEAT Cricket Awards 2024

  • ముంబైలో ఘ‌నంగా సియట్ 26వ ఎడిషన్ అవార్డ్స్ వేడుక‌ 
  • ఇటీవ‌ల జ‌రిగిన వ‌న్డే, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో రోహిత్‌ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు సియ‌ట్ అవార్డు
  • ఈ అవార్డును అందుకోవడం ఎప్ప‌టికీ గుర్తుండిపోయే గొప్ప‌ అనుభవమ‌న్న హిట్‌మ్యాన్‌

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన అవార్డు అందుకున్నాడు. ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సియట్‌ క్రికెట్ రేటింగ్స్ అవార్డ్స్ 2024లో ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ పుర‌స్కారం దక్కించున్నాడు. సియట్ 26వ ఎడిషన్ అవార్డ్స్ వేడుక‌ ముంబైలో బుధవారం ఘ‌నంగా జరిగింది. 

ఇక ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ‌క‌ప్‌ను రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. జూన్ 29న బార్బ‌డోస్‌లోని కెన్సింగ్ట‌న్ ఓవ‌ల్‌లో జ‌రిగిన ఫైన‌ల్‌లో ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా రెండోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది. 

అటు గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ రోహిత్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతంగా రాణించింది. టోర్నీలో వ‌రుస‌గా 10 మ్యాచులు గెలిచి ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. కానీ, అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన‌ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగ‌ప‌డింది. దాంతో త్రుటిలో మూడోసారి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచే అవ‌కాశాన్ని కోల్పోయింది. 

ఇక ఈ రెండు ఐసీసీ మెగా టోర్నీల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుతంగా రాణించాడు. అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో హిట్‌మ్యాన్‌ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ పుర‌స్కారానికి ఎంపిక‌య్యాడు. త‌న‌కు దక్కిన ఈ అరుదైన పుర‌స్కారం ప‌ట్ల రోహిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సందర్భంగా సియట్‌కి ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.  

"సియట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడం ఎప్ప‌టికీ గుర్తుండిపోయే గొప్ప‌ అనుభవం. ఇది ప్రతి మ్యాచ్‌లోనూ సాగే కృషి, దృఢ సంకల్పానికి గుర్తింపు. ఈ గౌరవం కోసం నేను సియట్‌కి ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది న‌న్ను మైదానంలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను అందించ‌డానికి మ‌రింత ప్రేరేపిస్తుంది" అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. 
 
కాగా, రోహిత్ ఈ అరుదైన అవార్డును అందుకోవ‌డం ప‌ట్ల బీసీసీఐ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించింది. "సియ‌ట్ క్రికెట్ అవార్డ్స్‌లో మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మా కెప్టెన్‌కి అవార్డులు వస్తూనే ఉన్నాయి. అభినందనలు కెప్టెన్‌" అని బీసీసీఐ త‌న ఎక్స్ పోస్టులో రాసుకొచ్చింది.

More Telugu News