Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను నాశనం చేసి.. మహాత్మాగాంధీ కలను నెరవేరుస్తారు: ఆచార్య ప్రమోద్ కృష్ణన్ వ్యంగ్యం

Rahul Gandhi will destroy Cong soon says Acharya Pramod Krishnam

  • స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ భావించారన్న ఆచార్య
  • ఇందిరా, రాజీవ్ ఇలా ఎవరూ గాంధీ కలను నెరవేర్చలేదని వెంటకారం
  • మమతా బెనర్జీకి ఇబ్బంది కాకూడదని రాహుల్ కోల్‌కతాకు వెళ్లడం లేదని ఆరోపణ

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆచార్య ప్రమోద్ కృష్ణన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడని... తద్వారా మహాత్మా గాంధీ కలలను నెరవేరుస్తాడని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ భావించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కలను రాహుల్ గాంధీ నెరవేరుస్తారని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ దిగ్గజాలు, ఆ పార్టీ మాజీ ప్రధానులు విఫలమయ్యారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం మహాత్ముడి కోరికను తప్పకుండా నెరవేరుస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ఆయన ఐఏఎన్ఎస్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కోల్‌కతా హత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇండియా కూటమి అలయెన్స్ ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆయన కోల్‌కతాలో, అలాగే అయోధ్యలో పర్యటించడం లేదన్నారు. అయోధ్యలో ఇండియా కూటమిలోని సమాజ్‌వాది పార్టీ నాయకుడు నిందితుడిగా ఉన్నందున అక్కడకు వెళ్లడం లేదని ఆరోపించారు.

కోల్‌కతా, అయోధ్యలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ జరిగినా తప్పకుండా సందర్శించాలన్నారు. యూపీ, బెంగాల్, రాజస్థాన్, బీహార్ లేదా ఢిల్లీ... ఏ ప్రాంతం బాధితురాలైనా కావొచ్చు... కానీ ఆ బాధితురాలు భరతమాత బిడ్డ అని రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు. 

మమతను బాధపెట్టకూడదని కోల్‌‌కతా వెళ్లడం లేదు

కానీ తమ మిత్రపక్షమైన మమతా బెనర్జీని బాధపెట్టకూడదని రాహుల్ గాంధీ కోల్‌కతాకు వెళ్లలేదన్నారు. అయోధ్యలో ప్రధాన నిందితుడు ఎస్పీ నేత కాబట్టి అక్కడకూ వెళ్లడం లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులకు మద్దతివ్వాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా ఘటనపై రాహుల్ ప్రకటన ఆహ్వానించదగినది కాదన్నారు.

మమతా బెనర్జీ మానసిక సమతౌల్యం కోల్పోయినట్లుగా కనిపిస్తోందని ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో వామపక్షాలతో విభేదాలను మమతా బెనర్జీ పరిష్కరించుకున్నారని, కానీ అక్కడ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఆమెను కలవరపాటుకు గురి చేస్తోందన్నారు. అందుకే ఎవరైనా రాముడి గురించి మాట్లాడినా... సనాతన ధర్మం గురించి ప్రస్తావించినా ఆమె చిరాకు పడుతోందన్నారు.

కోల్‌కతా హత్యాచార ఘటనపై మమతా బెనర్జీ సమాధానం చెప్పాలన్నారు. నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ఎవరు ధ్వంసం చేశారని నిలదీశారు. చరిత్ర ఆమెను ఎప్పటికీ క్షమించదన్నారు. మమతను తాను కూడా గౌరవిస్తానని... కానీ ముఖ్యమంత్రిగా ఆమె తన బాధ్యతను నిర్వర్తించి దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

More Telugu News