Kolkata Doctor Rape Murder Case: కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

Key Suspect Sanjay Roy in Kolkata Doctor Rape Murder Case Went to Red light Areas

  • వైద్యురాలిపై దాడికి ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన సంజ‌య్ రాయ్‌
  • మిత్రుడితో క‌లిసి తొలుత సోనాగచి రెడ్‌లైట్‌ ఏరియాకు 
  • ఆ త‌ర్వాత దక్షిణ కోల్‌కతాలోని మ‌రో వ్యభిచార గృహానికి వెళ్లిన నిందితుడు 
  • ఆ స‌మ‌యంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మ‌హిళ‌పై న‌గ్న ఫొటోల కోసం వేధింపులు

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్‌ రాయ్‌కి సంబంధించిన మ‌రో సంచ‌ల‌న‌ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్ప‌డే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్‌ వాలంటీర్ తో కలిసి కోల్‌కతాలోని రెడ్‌లైట్‌ ఏరియాలకు వెళ్లిన‌ట్లు తెలిపాయి. 

వారిద్దరు కలిసి ఓ ద్విచ‌క్ర‌వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అనంత‌రం అర్ధరాత్రి సమయంలో మొద‌ట‌ సోనాగచికి వెళ్లారు. అక్కడ రాయ్‌ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి స్నేహితుడు లోపలికి వెళ్లాడు. ఆ త‌ర్వాత‌ రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మ‌రో వ్యభిచార గృహానికి వెళ్లారు. 

ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్‌ వేధింపులకు గురిచేసిన‌ట్లు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అతడు మ‌హిళ‌ను న్యూడ్ ఫొటోలు కావాల‌ని అడిగిన‌ట్లు స‌మాచారం. ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీకార్‌ ఆసుపత్రికి చేరుకున్న నిందితుడు.. మొద‌ట ఆపరేషన్‌ థియేటర్ త‌లుపును పగలగొట్టాడు. 

ఆ త‌ర్వాత 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించిన‌ట్లు అధికారులు తెలిపారు. అనంత‌రం మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాల్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢ నిద్రలో ఉన్న బాధితురాలిపై దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్‌!
ఇక ఘ‌ట‌న జ‌రిగిన ఆగస్టు 8న రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీకార్‌ ఆసుపత్రి వెనక వైపు నిందితుడు సంజయ్ రాయ్‌ మద్యం సేవించినట్లు పలువురు తెలిపారు. ఆ సమయంలో అశ్లీల‌ వీడియోలు చూసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించాక‌ పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు 9న‌ ఉదయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి ఈ విషయం చెప్పారు. తొలుత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది స‌మాచారం ఇచ్చారు. కానీ, ఆ త‌ర్వాత‌ ఇది హత్యాచారంగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించ‌డం జ‌రిగింది.

More Telugu News