Supreme Court: సెక్షన్ 306ను అమలు చేయాలంటే ఆత్మహత్యకు పురికొల్పినట్టు ఆధారాలుండాలి: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

No Active Role Played by Wife SC Discharges Abetment to Suicide Case

  • ఆత్మహత్యకు పురికొల్పేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసి ఉంటేనే సెక్షన్ 306
  • ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  • బాంబే హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

ఓ వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించే నిబంధన అమలు చేయాలంటే నిందితుడు బాధిత వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పి ఉండడమో, ఇతరులతో కలిసి కుట్రలో పాలుపంచుకోవడమో, లేదంటే నేరం చేసిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా సాయం చేసి ఉండడమో చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

తన భర్త ఆత్మహత్య విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయడం కుదరదంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ రోహిణి సుదర్శన్ గంగుర్డే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ ఆదేశాలను సమర్ధించడంపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ ఆసుపత్రిలో సామాజిక సేవా సూపరింటెండెంట్‌గా పనిచేసిన 38 ఏళ్ల సుదర్శన్ గంగుర్డే 17 ఫిబ్రవరి 2020న శింగనాపూర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం, కొట్టడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సుదర్శన్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇరు కుటుంబాలకు ఇష్టం లేకున్నా సుదర్శన్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మగబిడ్డ కూడా జన్మించాడు. ఆ తర్వాత ఉమ్మడిగా వారు ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశారు. ఆ ఇంటిని తన పేరున మార్చమని భార్య బాధితుడిని వేధించిందని, అతడి ఆత్మహత్యకు అదే కారణమని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 

అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని, భర్తను ఆత్మహత్యకు పురికొల్పేలా చేసినట్టు ఆధారాలు లేవని రోహిణి వాదించింది. తాముండే ఇంటిని ఉమ్మడిగా కొనుగోలు చేయడంతో దానిని తన పేరున బదిలీ చేయాలని బలవంతం చేశామన్న ప్రశ్నే లేదని పేర్కొంది. అయితే, సాక్ష్యాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

దీంతో రోహిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. మరణించిన వ్యక్తి వైవాహిక జీవితంలో ఎలాంటి వివాదాలు లేవని, ఆయన ఆత్మహత్యకు, వైవాహిక బంధానికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని స్పష్టం చేసింది. భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

  • Loading...

More Telugu News