ICC Women T20 World Cup 2024: 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ఆతిథ్యం
- బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మార్చిన ఐసీసీ
- బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతే కారణం
- అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మెగాటోర్నీ
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లా నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వేదిక మారినప్పటికీ, ఈవెంట్‌కు హోస్ట్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని ఐసీసీ వెల్లడించింది.
కాగా, ఐసీసీ నిర్వహించిన వర్చువల్ బోర్డు సమావేశంలో వేదికను మార్చాలని నిర్ణయించారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సిన ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సభ్యదేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపించకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అక్టోబర్ 3 నుంచి 20 మధ్య యూఏఈలోని దుబాయ్, షార్జాలోని రెండు వేదికలలో మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, వేదిక మార్పు అనేది నిరాశను కలిగించేదే అని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్‌డైస్ అన్నారు. అదే సమయంలో దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు బీసీబీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
అలాగే టోర్నీ నిర్వహణకు అంగీకరించిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న యూఏఈ ఇటీవలి కాలంలో క్రికెట్‌కు ప్రధాన కేంద్రంగా మారుతోంది.
ఇప్పటికే ఒమన్‌తో కలిసి యూఏఈ అనేక ఐసీసీ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లను నిర్వహించింది. అలాగే 2021లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు వేదికగా నిలిచింది. దీంతో పాటు 2020లో కరోనా కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తం ఇక్కడే జరిగింది. అలాగే 2021 ఐపీఎల్ సీజన్ రెండో దశ మ్యాచులు ఇక్కడే నిర్వహించిన విషయం తెలిసిందే.