T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించిన పిచ్‌లకు రేటింగ్ ఇచ్చిన ఐసీసీ

ICC gave satisfactory rating for six of the eight matches played in Nassau County Cricket Stadium


టీ20 వరల్డ్ కప్‌-2024 లీగ్ దశలో న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్‌లు జరిగాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఇక్కడే నిర్వహించారు. అయితే ఈ మైదానం వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. 

న్యూయార్క్‌లో జరిగిన 8 మ్యాచ్‌ల మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 107.6 పరుగులుగా ఉంది. దీంతో క్రికెట్ నిపుణులతో పాటు క్రికెట్ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. స్లో పిచ్, అన్యూహంగా బంతి బౌన్స్ అవడంతో ఇక్కడ నిర్వహించిన మ్యాచ్‌లకు రిఫరీలుగా వ్యవహరించిన రంజన్ మదుగలే, డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రిచీ రిచర్డ్‌సన్ విమర్శలు ఎదుర్కొన్నారు. 

అయితే టోర్నీ ముగిసిన దాదాపు 50 రోజుల తర్వాత నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌ల పిచ్‌లకు ఐసీసీ రేటింగ్స్ ఇచ్చింది. 

ఈ స్టేడియంలో మొత్తం 8 మ్యాచ్‌లు జరగగా 6 మ్యాచ్‌ల కోసం వినియోగించిన పిచ్‌లకు ఐసీసీ ‘సంతృప్తికరం’ అంటూ రేటింగ్ ఇచ్చింది. రెండు మ్యాచ్‌లకు 'అసంతృప్తికరం' అంటూ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఒక మ్యాచ్ భారత్, ఐర్లాండ్ మధ్య జరగగా, రెండవది శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిందని ఐసీసీ తెలిపింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌పై మంగళవారం పిచ్ రేటింగ్‌లను ప్రచురించింది.

ఒకే ఒక్క పిచ్‌కు ‘చాలా బాగుంది’ రేటింగ్

మొత్తంగా చూస్తే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు జరగగా కేవలం 3 మ్యాచ్‌లకు సిద్ధం చేసిన పిచ్‌లకు మాత్రమే ‘అసంతృప్తి’ రేటింగ్స్ ఇచ్చింది. అసంతృప్తికరం రేటింగ్ ఇచ్చిన మూడవ పిచ్ ట్రినిడాడ్‌లో ఆఫ్ఘనిస్తాన్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ అని, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయ్యిందని పేర్కొంది.

ఇక సూపర్-8 దశలో భాగంగా బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ -భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ‘సంతృప్తికరం’ రేటింగ్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్‌‌కు సిద్ధ: చేసిన పిచ్‌కు మాత్రమే ‘చాలా బాగుంది’ రేటింగ్‌ను ఐసీసీ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జూన్ 1న మొదలై అదే నెల 29న ముగిసింది.

More Telugu News