Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ను కలిసిన హెచ్ సీఎల్ బృందం... రాష్ట్రంలో మరో 15 వేల ఉద్యోగాలు
- ఏపీలో కార్యకలాపాల విస్తరణకు హెచ్ సీఎల్ సంసిద్ధత
- ప్రస్తుతం ఏపీలో హెచ్ సీఎల్ లో 4,500 మంది ఉద్యోగులు
- కొత్త కార్యాలయం నిర్మించేందుకు హెచ్ సీఎల్ ఆసక్తి
- అన్ని అనుమతులు మంజూరు చేస్తామన్న నారా లోకేశ్
ఏపీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు హెచ్ సీఎల్ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ఇవాళ హెచ్ సీఎల్ ప్రతినిధుల బృందం అమరావతిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసింది.
రాష్ట్రంలో మరో 15 వేల ఉద్యోగాల కల్పనకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు హెచ్ సీఎల్ ప్రతినిధులు సుముఖత వెలిబుచ్చారు. విస్తరణకు కావాల్సిన అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ప్రస్తుతం హెచ్ సీఎల్ లో 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి తమ లక్ష్యం మరో 5,000 మందికి తక్షణ ఉపాధి కల్పించడమేనని హెచ్ సీఎల్ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త కార్యాలయం నిర్మించాక మరో 10 వేల మంది వరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
భారీగా ఉపాధి కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అంతేకాదు, స్కిల్ డెవలప్ మెంట్, నైపుణ్య గణన కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతామని హెచ్ సీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... గత ప్రభుత్వ పాలనలో హెచ్ సీఎల్ కార్యకలాపాలు ముందకు సాగలేదని తెలిపారు. పూర్తి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
హెచ్ సీఎల్ విస్తరణకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. హెచ్ సీఎల్ కు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన రాయితీలను దశల వారీగా చెల్లిస్తామని చెప్పారు.