Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌తో ఏడాదిగా ఇబ్బందులు.. క‌స్ట‌మ‌ర్ వినూత్న నిర‌స‌న‌.. వీడియో వైర‌ల్‌!

Customer Holds Unique Protest Against Faulty Ola Electric Scooter

  • ఓలా స్కూట‌ర్‌ను రిక్షాపై తీసుకొచ్చి షోరూమ్ ముందు పేర‌డీ పాట పాడుతూ నిర‌స‌న‌
  • ఈ వినూత్న నిర‌స‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్
  • త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న నెటిజ‌న్లు

ఓలాకి చెందిన ఎలక్ట్రిక్ స్కూట‌ర్లు త‌ర‌చూ మొరాయిస్తున్న‌ట్లు ఇటీవ‌ల నెట్టింట ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఇలాగే ఒక ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్‌కు ఇటీవల వాహ‌నం బాగా ఇబ్బంది పెడుతోంది. దాంతో కంపెనీ షోరూమ్ వెలుపల తన స్కూటర్‌కు మాక్ అంత్యక్రియలు నిర్వహించి, కంపెనీ పేలవమైన విక్రయానంతర సేవల‌పై త‌న అసహనాన్ని ప్రదర్శించారు.  

సాగ‌ర్ సింగ్ అనే వ్య‌క్తి ఆగిపోయిన త‌న ఓలా స్కూట‌ర్‌ను రిక్షాపై తీసుకొచ్చి ఓలా షోరూమ్ ముందు ఉంచి, బాలీవుడ్ పాట 'తడప్ తడప్ సాంగ్‌ను పేరడీగా 'లూట్ గయే హమ్ ఓలా లే కర్ కే' (మనం ఓలా చేత మోసపోయాం) అని పాడాడు. దీంతో ఒక్క‌సారిగా షోరూమ్ ముందు జ‌నాలు గుమిగూడారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క‌చ్చితంగా తెలియనప్పటికీ, సోమవారం (ఆగస్టు 19) పోస్ట్ చేసినప్పటి నుండి వీడియో నెట్టింట బాగా వైర‌ల్‌గా మారింది. 

'సాగర్ సింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. ఏడాది కాలంగా స్కూటర్‌లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఉంటుంది. పైగా ఓలా ఎలాంటి విక్రయానంతర సేవల‌ను అందించలేదు. అందుకే సాగర్ స్కూటర్‌ను రిక్షాపై ఎక్కించి ఓలా షోరూమ్ ముందు ఉంచి, పాటలు పాడుతూ నిరసన తెలిపాడు” అని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) యూజ‌ర్‌ పంకజ్ పరేఖ్ ఈ ప్రత్యేకమైన నిరసన వీడియోను పంచుకున్నారు. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఒక‌రు ''పర్ఫెక్ట్ .. ఓలాకు ఇలాగే జ‌ర‌గాలి. సర్వీస్ సెంటర్ సమస్యల కారణంగా నా ఓలా ద్విచ‌క్ర‌వాహ‌నం రెండు నెలలుగా ఇంట్లోనే ఉంది" అని కామెంట్ చేశారు. మరొకరు ''పాట చాలా బాగా పాడారు. ఓలా ఎల‌క్ట్రిక్‌ కస్టమర్‌కు సరైన సేవల‌ను అందించ‌డం లేదు. ఈ నిరసన తర్వాత కూడా అందిస్తుంద‌ని నేను అనుకోవ‌డం లేదు" అని వ్యాఖ్యానించారు. 

అలాగే ''ఈ సమస్యలను వారి ఐపీఓ కంటే ముందే ప్రస్తావించారు. ఇప్పటికీ చాలా మంది ఓలా స్కూటర్‌లతో రోడ్డుపై కుస్తీలు ప‌డుతున్నారు. చాలా మంది ఓలా సర్వీస్ అధ్వానంగా ఉందని, దాదాపుగా ఉనికిలో లేదని అంటున్నారు" అంటూ కామెంట్ చేశారు. 

మ‌రో యూజ‌ర్ ''పనితీరుతో పోలిస్తే చాలా ఖరీదైంది. దీని బ‌దులు మ‌రో వాహ‌నం కొనుగోలు చేయ‌డం బెట‌ర్" అని అంటే, ఇంకొక‌రు ''ఇటీవల కాలంలో నిరసనను తెల‌ప‌డానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటని నేను భావిస్తున్నాను. ప్రయోజనం కోసం ఈ వీడియోను కచ్చితంగా వైరల్ చేయాలి" అని రాసుకొచ్చారు.

  • Loading...

More Telugu News