Karun Nair: కరుణ్ నాయర్ విధ్వంసం.. 48 బంతుల్లోనే 124 రన్స్!
- మహారాజ టీ20 ట్రోఫీలో భాగంగా మైసూర్ వారియర్స్, మంగళూరు డ్రాగన్స్ మధ్య మ్యాచ్
- సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోసిన కరుణ్ నాయర్
- 43 బంతుల్లోనే సెంచరీ బాదిన టీమిండియా క్రికెటర్
మహారాజ టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ సారథి కరుణ్ నాయర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును వణికించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళూరు డ్రాగన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 48 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు.
ఈ ఊచకోత ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు, 13 బౌండరీలు బాదాడీ టీమిండియా క్రికెటర్. 258.33 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక మొదట టాస్ గెలిచిన మంగళూరు కెప్టెన్ శ్రేయస్ గోపాల్.. మైసూర్ వారియర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత మైసూర్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. మొదటి 8 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. ప్రారంభంలో త్వరగా వికెట్లు పడడంతో సమిత్ ద్రవిడ్‌తో కలిసి కెప్టెన్ కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ ద్వయం 21 బంతుల్లో 36 పరుగులు జోడించింది. ఆ తర్వాత సమిత్ 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అప్పుడు మైసూర్ స్కోర్ 11.3 ఓవర్లలో 97 రన్స్‌కు 3 వికెట్లుగా ఉంది. ఇక్కడి నుంచి నాయర్ ఊచకోత మొదలైంది. అంతే.. బౌండరీల వర్షం కురిసింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లలో 166 పరుగులకు కుదించారు. దీంతో 167 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన మంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులోని వికెట్ కీపర్, బ్యాటర్ సిద్ధార్థ్ హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 50 రన్స్) తో మెరిశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో మంగళూరుకు ఓటమి తప్పలేదు. 27 పరుగుల తేడాతో మైసూర్ వారియర్స్ ఘన విజయం సాధించింది.