Vijayashanti: ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం?.. కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

Vijayashanti Tweet on Kolkata Doctor Rape and Murder

  • దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన
  • బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు 
  • ఈ ఘ‌ట‌న‌పై  'ఎక్స్' వేదిక‌గా స్పందించిన‌ కాంగ్రెస్ నేత‌ విజ‌య‌శాంతి
  • ఎన్‌కౌంట‌ర్లు జ‌రుగుతున్నా దారుణాలు ఆగ‌డం లేద‌ని వాపోయిన సీనియ‌ర్ న‌టి

కోల్‌కత వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కాంగ్రెస్ నేత‌, సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి స్పందించారు. ఎన్ని నిర‌స‌న‌లు చేసినా అత్యాచార ఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుటుంబం, స‌మాజం, పోలీస్‌, న్యాయ వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ చివ‌రికి ఎన్‌కౌంట‌ర్లు జ‌రుగుతున్నా ఈ దారుణాలు ఆగ‌డం లేద‌ని వాపోయారు. 

తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న తన హృదయాన్ని తొలిచివేస్తోందని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించింద‌ని దోషుల‌కు క‌చ్చితంగా శిక్ష ప‌డుతుంద‌నే నమ్మ‌కం ఉంద‌న్నారు. నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే త‌న‌ బలమైన ఆకాంక్ష అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో 'ప్ర‌తిఘ‌ట‌న' అవ‌స‌ర‌మ‌ని త‌న సినిమాలోని పాట‌ను ట్వీట్‌కు జ‌త చేశారు. 

"కోల్‌కత వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన జరిగి సుమారుగా 10 రోజులు దాటింది. సాధారణంగా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా నేను వెంటనే స్పందిస్తూ నా ఆక్రోశాన్ని, ఆవేదనను వెలిబుచ్చుతుంటాను. కోల్‌కత ఘటన గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టవచ్చు. కానీ, నాలాగా ఎందరు ఎంతగా ఎంత గొంతు చించుకున్నా, ఎందరెందరో ఎన్నెన్ని నిరసనలు చేసినా ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు ఆగడం లేదనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తూ గతంలో చోటు చేసుకున్న ఇలాంటి హత్యాచార ఘటనల పరిస్థితులు, పరిణామాలపై నాలో నేను సంఘర్షణ పడుతూ ఉన్నాను. 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కుటుంబం, సమాజం, పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఇన్ని ఉన్నప్పటికీ.. తప్పో, ఒప్పో చివరికి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదు. తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న నా హృదయాన్ని తొలిచివేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణ జరుగుతుంది. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ, దోషులకు శిక్షపడుతుంది కదా.. అని నేరాలను ఉపేక్షించం కదా? నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే నా బలమైన ఆకాంక్ష. ఇందుకు ఇంకెంతకాలం నిరీక్షించాలో కదా" అని విజ‌య‌శాంతి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News