Narendra Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ... ఈ నెల 23న జెలెన్ స్కీతో కీలక భేటీ

Modi will tour Poland and Ukraine

  • రేపు, ఎల్లుండి పోలెండ్ లో పర్యటించనున్న మోదీ
  • అనంతరం ఉక్రెయిన్ లో పర్యటన
  • 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ కు భారత ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన రేపు, ఎల్లుండి యూరోపియన్ దేశం పోలెండ్ లో పర్యటించనున్నారు. ఓ భారత ప్రధాని పోలెండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. 

మధ్య యూరప్ దేశాల్లో పోలెండ్ దేశం భారత్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది. పోలెండ్ కు కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్ లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అటు, పోలెండ్ లో భారత్ కు చెందిన 5 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 

ఇక, పోలెండ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మోదీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నర కాలంగా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతున్న నేపథ్యంలో, మోదీ పర్యటనపై అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 

చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు మోదీ కూడా జెలెన్ స్కీతో సమావేశంలో అదే వైఖరికి కట్టుబడి ఉండే అవకాశాలున్నాయి. ఓ భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించనుండడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News