KTR: అక్కడ రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేం అధికారంలోకి వచ్చాక తొలగిస్తాం: కేటీఆర్ హెచ్చరిక

KTR warns congress over Rajiv Gandhi statue

  • సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకని నిలదీత
  • తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్
  • వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా? అని మండిపాటు

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే... తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేలా సచివాలయాన్ని కడితే కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేమిటని నిలదీశారు. రాజకీయాల్లో అధికారం, పదవులు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు, రాజీవ్‌కు ఏం సంబంధం ఉందో చెప్పాలని నిలదీశారు. వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఏర్పాటు దారుణమన్నారు. రాష్ట్రంలో రాజీవ్ పేరుతో ఉన్న రింగ్ రోడ్డు, హైదరాబాద్ విమానాశ్రయం సహా ఇతర సంస్థల పేర్లను సైతం మారుస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఇందిరాగాంధీ, రాజీవ్‌ పేర్లతో హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా మారకుంటే అధికారంలోకి వచ్చాక తాము మారుస్తామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మనసు మార్చుకుని సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్‌లో లేదా రేవంత్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News