Rahul Gandhi: ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణించి... డ్రైవర్ ఫ్యామిలీతో హోటల్లో భోజనం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi highlights gig workers plight

  • క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడి గిగ్ వర్కర్ల సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేత
  • గిగ్ వర్కర్లు రోజువారీ సంపాదనతోనే బతుకుతున్నారన్న రాహుల్ గాంధీ
  • క్యాబ్ డ్రైవర్ పిల్లలకు బహుమతి ఇచ్చిన రాహుల్ గాంధీ

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం గిగ్ వర్కర్ల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడానికి కచ్చితమైన విధానాలను రూపొందిస్తున్నాయని వెల్లడించారు. అలాగే, ఇండియా కూటమి దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల పరిష్కారంపై కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇటీవల రాహుల్ గాంధీ ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణించారు. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడిన వీడియో కాంగ్రెస్ అగ్రనేత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

తక్కువ ఆదాయం, ద్రవ్యోల్భణం ఇలాంటి వారి జీవితాలను ఆగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత గిగ్ వర్కర్ల దుస్థితి ఇలా ఉందని వెల్లడించారు. ఉబెర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తాను క్యాబ్ డ్రైవర్ సునీల్ ఉపాధ్యాయ్‌తో మాట్లాడానని తెలిపారు. ఆ తర్వాత అతని కుటుంబాన్ని కలిశానని, వారి పరిస్థితి చూశాక, డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు వంటి గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఆందోళన కలిగించాయన్నారు.

వారు కేవలం ప్రతిరోజు వచ్చే సంపాదనతోనే బతుకును వెళ్లదీస్తున్నారన్నారు. పొదుపు చేయలేరు... కుటుంబ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కచ్చితమైన విధివిధానాలను రూపొందించి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ వీడియో 11 నిమిషాలకు పైగా ఉంది. రాహుల్ గాంధీ ఉబెర్ యాప్ ద్వారా ట్యాక్సీని బుక్ చేసుకున్న అనంతరం క్యాబ్‌లో ప్రయాణిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. క్యాబ్ డ్రైవర్ ఉత్తర ప్రదేశ్‌లోని ఎటాహ్‌కు చెందిన వ్యక్తి. అతను గ్రాడ్యుయేషన్, ఐటీఐ చేసినట్లుగా రాహుల్ గాంధీతో చెప్పాడు. తన ప్రయాణం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ క్యాబ్ డ్రైవర్ పిల్లలకు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అంతేకాదు, ఆ మరుసటి రోజు ఢిల్లీలోని ఓ హోటల్లో క్యాబ్ డ్రైవర్ కుటుంబంతో కలిసి భోజనం చేశారు.

More Telugu News