Chiranjeevi: ఈ సినిమాను నేచురల్‌గా తెరకెక్కించటానికి టీమ్ పడ్డ కష్టం తెరపై కనిపించింది: చిరంజీవి
- నిహారిక సమర్పణలో 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం
- ఈ నెల 9న విడుదల
- బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న చిత్రం
- తాజాగా చిరంజీవిని కలిసిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రబృందం
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.
ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల కాగా, డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశసంలను కూడా అందుకున్న ఈ సినిమా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, క్రిష్, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలా మంది కమిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి యావత్ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదువంశీతో పాటు చిత్రంలోని నటీనటులందరూ చిరంజీవిని కలుసుకున్నారు. వారందరితో చిరంజీవి ముచ్చటిస్తూ సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... "మా నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను. చాలా బాగుంది. అందరూ కొత్త కుర్రాళ్లే. చాలా చక్కగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మరచిపోయాను. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అయిన తీరు అద్భుతం.
సినిమాను నేచురల్‌గా చిత్రీకరించటంలో ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే... అది తెరపై కనిపించింది. రీజనబుల్ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదువంశీకి ప్రత్యేకమైన అభినందనలు. దర్శకుడిగా తను చక్కటి ప్లానింగ్‌తో సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ముందుగా డిజైన్ చేసుకోవటం వల్ల బాగా తెరకెక్కించగలిగాడు.
రీసెంట్‌గా విడుదలైన సినిమాల్లో కమిటీకుర్రోళ్లు ముందంజలో ఉంటూ మంచి వసూళ్లను రాబడుతుంది. ఎంటైర్ టీమ్‌కు నా అభినందనలు’’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.