Food Poisioning: ఏపీలో ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్... ముగ్గురు చిన్నారుల మృతి
- అనకాపల్లి జిల్లాలో ఘటన
- నిన్న సమోసాలు తిన్న పిల్లలు
- అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రులకు తరలింపు
- చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు.
నిన్న సమోసాలు తిన్న తర్వాత 27 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. జాషువా (1వ తరగతి), భవాని, శ్రద్ధ (మూడో తరగతి) అనే ఈ చిన్నారుల మృతితో అనాథాశ్రమంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా, ఈ అనాథాశ్రమంలో మొత్తం 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వారంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె.విజయ విచారణకు ఆదేశించారు.