Cybercrime: తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన వైద్యుడు!

Cybercriminals looted over Rs 8 Cr from Hyderabad doctor

  • మే 21న ఆన్‌లైన్‌లో స్టాక్ బ్రోకింగ్ యాడ్ చూసిన వైద్యుడు
  • తొలుత కొంత పెట్టుబడి పెట్టి లాభాల ఉపసంహరణ 
  • నమ్మకం కుదరడంతో 63 విడతల్లో రూ. 8.6 కోట్ల పెట్టుబడి
  • ఆ తర్వాత మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
  • దేశవ్యాప్తంగా బదిలీ అయిన వైద్యుడి సొమ్ము
  • కరీంనగర్ జిల్లా వీణవంక బ్యాంకుకూ కొంత సొమ్ము బదిలీ 

సైబర్ క్రిమినల్స్ బారినపడిన హైదరాబాద్ వైద్యుడు ఒకరు ఏకంగా రూ. 8.6 కోట్లు చెల్లించుకున్నాడు. మోసపోయానని తెలిసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణలో నమోదైన అతిపెద్ద సైబర్ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)కి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మోసపోయిందిలా..
మే 21న వైద్యుడికి ఫేస్‌బుక్‌లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులోని వివరాలను నింపాడు. ఆ వెంటనే కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు వైద్యుడిని సంప్రదించి ఆయన ఫోన్ నంబరును నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. ప్రముఖ కంపెనీల తరపున స్టాక్ బ్రోకర్లుగా తాము వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు ఏవో చెప్పాలని వైద్యుడు అడిగితే అవి రహస్యమని, చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు సంస్థల పేరిట యాప్ లింకులను పంపి వాటిలో డబ్బులు  పెట్టుబడి పెట్టమన్నారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు ఉపసంహరించుకోవచ్చని కూడా చెప్పారు. దీంతో పలుమార్లు పెట్టుబడులు పెట్టిన వైద్యుడు లాభాలను కూడా ఉపసంహరించుకున్నాడు. దీంతో వారిపై మరింత నమ్మకం కుదరడంతో విడతల వారీగా ఏకంగా రూ. 8.6 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. 

అసలు రంగు బయటపడిందిలా..
కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల ఉపసంహరణకు వైద్యుడు ప్రయత్నించగా కుదరలేదు. లాభాల్లో 20 నుంచి 30 శాతం చెల్లిస్తేనే వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పడంతో వైద్యుడు షాకయ్యాడు. ఆపై కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మ్యూల్ ఖాతాలకు వైద్యుడి సొమ్ము
ఈజీగా డబ్బు సంపాదించవచ్చనో, కమిషన్‌కు ఆశపడో తమ బ్యాంకు ఖాతాలను సైబర్ క్రిమినల్స్‌కు అప్పగించే వారిని ‘మనీ మ్యూల్స్’గా వ్యవహరిస్తారు. వైద్యుడు మొత్తంగా 63 విడతల్లో బదిలీ చేసిన నగదులో కొంతమొత్తం కరీంనగర్‌ జిల్లా వీణవంక బ్యాంకుకు చేరగా.. మిగతా మొత్తం విశాఖపట్టణం, కడప, ముంబై, ఢిల్లీ, థానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లుథియానాతోపాటు హరియానాలోని కొన్ని ప్రాంతాల్లోని మ్యూల్ ఖాతాలకు వెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News