Jay Shah: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడకపోవడంపై జై షా ఆసక్తికర వ్యాఖ్యలు

BCCI Secretary Jay Shah opened up on the absence of Rohit and Virat from the Duleep Trophy


త్వరలోనే మొదలుకానున్న దులీప్ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభం కాబోతోంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడంతో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు సైతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నారు. అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5న ప్రారంభమై అదే నెల 24న ముగియనున్న ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి కెప్టెన్లుగా శుభ్‌మాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌ పేర్లను బీసీసీఐ ప్రకటించింది.

అయితే అగ్రశ్రేణి స్టార్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను ప్రకటించలేదు. దీంతో బడా స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదా అనే చర్చ మొదలైంది. ఈ విమర్శలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. దులీప్ ట్రోఫీలో రోహిత్, విరాట్ కోహ్లీ ఆడకపోవడంపై ఆయన మాట్లాడుతూ.. వారిద్దరినీ (రోహిత్‌, విరాట్‌) దేశవాళీ క్రికెట్‌లో ఆడమని ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. వారిద్దరినీ దేశవాళీ క్రికెట్ ఆడమనడం బుద్ధిలేని పని అని, వారిపై ఒత్తిడిని దృష్టిలో ఉంచుకోవాలని జైషా వ్యాఖ్యానించారు.

కాగా గాయపడి కోలుకున్న ఆటగాళ్లు ఎవరైనా జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటే దేశవాళీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుందని జై షా స్పష్టంగా చెప్పారు. 2022లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడిన నాటి సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. జడేజా సౌరాష్ట్ర తరపున ఆడిన తర్వాత మాత్రమే జట్టులోకి వచ్చాడని అన్నారు. ‘‘ఆటగాళ్ల పునరాగమనం విషయంలో మేము కొంచెం కఠినంగా ఉన్నాం. రవీంద్ర జడేజా గాయపడినప్పుడు అతడికి ఫోన్ చేసి దేశవాళీ ఆట ఆడమని కోరాను. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎవరు గాయపడి జట్టులో చోటు కోల్పోయినా .. తిరిగి ఆటను నిరూపించుకున్న తర్వాతే జట్టులోకి రాగలరు’’ అని జై షా అన్నారు. ఈ మేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో ఆయన మాట్లాడారు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు.

  • Loading...

More Telugu News