Bengaluru Incident: పార్టీ నుంచి తిరిగొస్తున్న అమ్మాయిపై అత్యాచారం

Biker raped student in Bengaluru

  • గెట్ టుగెదర్ పార్టీకి వెళ్లిన డిగ్రీ ఫైనల్ ఇయర్ యువతి
  • తిరిగి వస్తూ ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగిన వైనం
  • లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి

ఓవైపు కోల్ కతా అత్యాచార ఘటన యావత్ దేశాన్ని అట్టుడికిస్తుండగా, దేశ ఐటీ రాజధాని బెంగళూరులో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్లొస్తున్న అమ్మాయిపై అత్యాచారం జరిగింది. బెంగళూరు ఈస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

బాధితురాలు నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కోరమంగళ ప్రాంతంలో గెట్ టుగెదర్ పార్టీకి హాజరైన ఆ యువతి, వేకువజామున తిరిగి వచ్చే క్రమంలో, ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. బైక్ పై ఆ అమ్మాయిని ఎక్కించుకున్న ఆ వ్యక్తి... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడు ఒక్కడే అని, బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

దీనిపై బెంగళూరు ఈస్ట్ జోన్ ఏసీపీ రమణ్ గుప్తా మాట్లాడుతూ, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారని, బాధితురాలితోనూ, ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారని వెల్లడించారు. 

అత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించామని, పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్టు వివరించారు. త్వరలోనే రేపిస్టును అరెస్ట్ చేస్తామని ఏసీపీ చెప్పారు.

Bengaluru Incident
Student
Biker
Lift
Police
  • Loading...

More Telugu News