Ponnam Prabhakar: డాక్టర్లు నిరసన తెలపడం సబబే... కానీ డ్యూటీకి ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- కోల్ కతా హత్యాచార ఘటనను ఖండించిన మంత్రి పొన్నం
- సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని వెల్లడి
- నిందితులకు కఠిన శిక్ష పడాలని వ్యాఖ్యలు
- డాక్టర్లు ఓపీ సేవలు, ఎమర్జెన్సీ సేవలకు హాజరుకావాలని విజ్ఞప్తి
కోల్ కతాలో ఓ జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. దేశవ్యాప్తంగా వైద్యులు, జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
కోల్ కతా హత్యాచార ఘటన దారుణం అని, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితులకు కఠినశిక్ష పడాలని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపట్టిన నిరసనలు సబబే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
అయితే, విధి నిర్వహణకు కూడా డాక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో ఉంటూనే నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అవుట్ పేషెంట్ సేవలు (ఓపీ), ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయడం వల్ల రోగులు చాలా ఇబ్బంది పడతారని వివరించారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకువచ్చిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.