Tanikella Bharani: తనికెళ్ల భరణి ఆత్మీయతల ఆలంబనగా కనిపిస్తారు.. సన్మాన కార్యక్రమంలో పురాణపండ

- వరంగల్ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న భరణి
- హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మాన సభ
- హాజరైన రాంగోపాల్ వర్మ, మంజు భార్గవి, సుద్దాల సహా సినీ ప్రముఖులు
- భరణికి ఇప్పుడు డాక్టరేట్ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాంగోపాల్ వర్మ
టాలీవుడ్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాటల్లో, ప్రవర్తనలో, రచనలో ఆత్మబంధమే కానీ ముసుగులు ఉండవని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కొనియాడారు. ఎంతోమందికి ధైర్యం చెప్పి బతుకుల్ని పెంచిన ఆత్మీయతల ఆలంబనగా ఆయన కనిపిస్తారని ప్రశంసించారు. వరంగల్‌లోని ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి భరణి ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంగమ్ సంస్థకు చెందిన సంజయ్ కిశోర్ సారథ్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆయనకు సత్కారం నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, శంకరాభరణం ఫేమ్, ప్రముఖ నాట్యకారిణి మంజుభార్గవి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, ప్రముఖ సినీ దర్శకుడు జనార్ధన మహర్షి, ప్రముఖ యాంకర్ ఝాన్సీ, యువ నటుడు బాలాదిత్య తదితరులు పాల్గొన్నారు.

