Sweden: బాబ్బాబూ! మీకు డబ్బులిస్తాం.. మా దేశం వదిలి వెళ్లిపోరూ ప్లీజ్!
- స్వీడన్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన
- ఇతర దేశాల్లో పుట్టి తమ దేశంలో నివసిస్తున్న వారిని పంపే ఏర్పాట్లు
- ఒక్కొక్కరికి రూ. 80 వేలు ఇస్తూ.. ప్రయాణ చార్జీలు కూడా భరిస్తామని ప్రకటన
- దేశంలో వలస జనాభా పెరుగుతుండడమే కారణం
వేరే దేశాల్లో పుట్టి తమ దేశంలో నివసిస్తున్న పౌరులను స్వదేశాలకు పంపేందుకు స్వీడన్ సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతే డబ్బులు ఇవ్వడమే కాకుండా వారు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామని ప్రకటించింది. దేశంలోని వలసదారులకు ఇప్పటి వరకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల పౌరులకు విస్తరించింది. జనాభా విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. దేశంలో ప్రస్తుతం 20 లక్షలమందికిపైగా వలసదారులు ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు 2015లో వలసలపై ఆంక్షలు విధించినప్పటికీ పెద్దగా పనిచేయలేదు. దీంతో ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఒక్కొక్కరికి రూ. 80 వేలు
తమ దేశాన్ని స్వచ్ఛందంగా వీడిపోయే పౌరులకు ఒక్కొక్కరికి 10 వేల స్వీడన్ క్రౌన్స్ (రూ. 80 వేలు) ఇస్తామని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ ప్రకటించారు. చిన్నారులకు ఈ మొత్తంలో సగం ఇస్తారు. అంతేకాదు, ఈ డబ్బును ఒకేసారి చెల్లిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. వివిధ దేశాల నుంచి వచ్చి స్వీడన్‌లో స్థిరపడుతున్న వారు ఇక్కడ ఇమడలేకపోతున్నారని, అలాంటి వారికి ఇది సువర్ణావకాశమని మంత్రి తెలిపారు