Duvvada Srinivas: తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా: దువ్వాడ శ్రీనివాస్
భార్య దువ్వాడ వాణితో వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిల్లల విషయంలో తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. తన కూతుళ్ల పేరు మీద సుమారు రూ.27 కోట్ల ఆస్తులు రాయటానికి సిద్దంగా ఉన్నానని, అయితే ఈ కొత్త ఇళ్లు మాత్రం రాసివ్వడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. దయచేసి తనకు ఇబ్బంది కలిగించవద్దని, ఇచ్చిన బంగ్లాను వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.
వ్యయాల కోసం 16 నెలల్లో రూ.40 లక్షలు ఇచ్చానని, అయితే లాయర్ చెప్పడంతో వాణి మాట మార్చారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దువ్వాడ వాణి రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, పిల్లలను తన ఇంటిపైకి పంపించారని వ్యాఖ్యానించారు. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారని, ఆస్తులపై మాట్లాడారని పేర్కొన్నారు.
ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూనే మరో వైపు కోర్టుకు వెళ్లారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఇక భర్తను, పెద్దమనుషులను వాణి గౌరవించరని అన్నారు. కుటుంబ పెద్దల ఒప్పందం మేరకు ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడ్డానని, పిల్లలకు తనపై తప్పుడు మాటలు చెప్పిందని వాణిపై మండిపడ్డారు. దువ్వాడ టెక్కలిలో ఉండకూడదని భావిస్తున్నారని, రాజకీయంగా పతనమవ్వాలనేదే వాణి ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టులలోనే తేల్చుకుంటానని చెప్పారు. వాణి నాటకీయంగా మాట మార్చిందని, రోజుకో నిబంధన, ఇప్పుడు కొత్తగా కలిసి ఉంటానని చెబుతోందని అన్నారు. తనను ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాతే బయటకు వెళ్లానని, తాను చచ్చానా, బ్రతికానా అనేది కూడా చూడలేదని అన్నారు.