Jasprit Bumrah: ధోనీ, విరాట్, రోహిత్ శర్మల కెప్టెన్సీలపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni gave me a lot of security and quickly says Jasprit Bumrah

  • ధోనీ జట్టులో భరోసా కల్పించాడన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
  • కెప్టెన్‌గా విరాట్ ఆటగాళ్లను ఫిటినెస్‌ దిశగా ప్రోత్సాహించాడని వ్యాఖ్య
  • రోహిత్ శర్మ ఆటగాళ్లకి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటాడని వెల్లడి

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత టాలెంట్ ఉన్న ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బీసీసీఐ అతడిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. సమయం చిక్కినప్పుడల్లా విశ్రాంతి ఇస్తోంది. జట్టు బౌలర్‌గా ఎంత ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా అప్పటి నుంచి ఎంతో కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. నాడు మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ సారధ్యంలో జట్టులోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. కెప్టెన్‌గా ‘మిస్టర్ కూల్’ తనకు ఏవిధంగా సాయం చేశాడో బుమ్రా వెల్లడించాడు.

‘‘ఎంఎస్ ధోనీ జట్టులో చోటు విషయంలో నాకు చాలా భద్రత కల్పించాడు. చాలా త్వరగా ఈ భరోసా ఇచ్చాడు. నాపై చాలా నమ్మకాన్ని ఉంచాడు. ధోనీ పెద్ద పెద్ద ప్రణాళికలను అంతగా నమ్మడు’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ధోనీ తన కెప్టెన్సీని కోహ్లీకి.. విరాట్ నుంచి జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు వెళ్లాయి. దీంతో వారి నాయకత్వంలో పనిచేయడంపై కూడా బుమ్రా మాట్లాడాడు. 

‘‘విరాట్ కోహ్లీ హుషారుగా ఉండేవాడు. అంకితభావంతో ఉండేవాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లను ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ ప్రోత్సాహించాడు. ఫిట్‌నెస్ విషయంలో జట్టు తీరుని మార్చాడు. ప్రస్తుతం విరాట్ కెప్టెన్ కాదు. కానీ ఇప్పటికీ అతడు ఒక నాయకుడిగానే ఉన్నాడు. కెప్టెన్సీ ఒక బాధ్యతాయుతమైన పదవి మాత్రమే. కానీ 11 మంది ఆటగాళ్లు ఉంటేనే జట్టు ముందుకు నడుస్తుంది’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో బుమ్రా మాట్లాడాడు.

ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. బ్యాట్స్‌మన్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్‌లలో రోహిత్ ఒకడని బుమ్రా మెచ్చుకున్నాడు. ఆటగాళ్ల భావోద్వేగాలను రోహిత్ అర్థం చేసుకుంటాడని, ఆటగాడు ఎలాంటి భావనలో ఉన్నాడనేది రోహిత్‌కు తెలుసునని,  కఠినంగా ఉండడని, ఆటగాళ్లకి ఎల్లప్పుడూ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని బుమ్రా అభిప్రాయపడ్డాడు.

కాగా జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుండగా.. ఇక టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడుతున్నాడు. ఇక 2020లో ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఈ ఏడాది జూన్ 29న టీ20 కెరియర్‌కు వీడ్కోలు పలికారు.

  • Loading...

More Telugu News