Revanth Reddy: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy fires at loan waiver issue

  • రుణమాఫీపై రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ
  • రుణమాఫీ కాకుంటే దరఖాస్తులు చేసుకోవాలంటూ మోసం చేస్తున్నారని మండిపాటు
  • క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతున్న రైతులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్న

రుణమాఫీపై రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రుణమాఫీకి 60 లక్షలమంది రైతులు అర్హులు కాగా, కేవలం 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ కావాలంటే రూ.49 వేల కోట్లు కావాలని... కానీ రూ.17 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

రుణమాఫీ కాకుంటే దరఖాస్తు చేసుకోవాలని రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. అందరికీ రుణాలు మాఫీ చేశామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతున్న రైతులకు సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే గ్రామాల్లోకి వెళ్లి రుణమాఫీ గురించి రైతులను అడగాలన్నారు.

మూడు విడతల్లో చేసిన రుణమాఫీపై ప్రభుత్వం పూర్తి వివరాలను వారం రోజుల్లో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ రుణమాఫీ రుణాలను ఆగస్ట్ నెలాఖరులోగా మాఫీ చేయాలన్నారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ తన నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి నియమనిబంధనలను ఖరారు చేయాలన్నారు. వరంగల్‌లో రుణమాఫీ కృతజ్ఞత సభ పెడితే రైతులు నిలదీయడం ఖాయమన్నారు.

  • Loading...

More Telugu News