Duvvada Srinivas: మీకు నచ్చినట్టు తిరగండి... కానీ మాతో ఉంటే చాలు: దువ్వాడ వాణి

Duvvada Vani press meet

  • ఇటీవల రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం
  • దివ్వెల మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్న శ్రీనివాస్ 
  • వ్యవహారాన్ని బట్టబయలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తె

ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్... దివ్వెల మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్న వ్యవహారం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి రచ్చకీడ్చారు. దువ్వాడ  శ్రీనివాస్ కుమార్తె కూడా తండ్రి వ్యవహారంపై బహిరంగంగా గళం విప్పారు. 

తాజాగా ఈ అంశంలో దువ్వాడ వాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందు రకరకాల కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శ్రీను గారి తల్లి, అతడి సోదరుడు ఎలాంటి కథలైనా క్రియేట్ చేయొచ్చు... కానీ శ్రీను గారే ఇలాంటి అవాస్తవాలను సృష్టిస్తుండడం బాధాకరమని వాణి పేర్కొన్నారు. 

"నా పట్ల, పిల్లల పట్ల తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. నా పిల్లలు కారం పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని వచ్చారంట. ఏ తండ్రయినా అలా చెప్పుకుంటారా అండీ! ఆ రోజు మీడియా అంతా రోడ్డుపైనే ఉంది కదా... నా పిల్లలపై ఎందుకు అలా అభాండాలు వేస్తున్నారు? పిల్లల మీద చెప్పినవాడు భార్య మీద చెప్పడా? ఎన్నయినా చెబుతాడు. 

ఒక తప్పుడు సందేశం అనేది ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశానని అంటున్నాడు. రాజకీయపరంగా శ్రీను గారు ముందుకు వెళతారులే అనే ఉద్దేశంతో నా కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని త్యాగం చేశాను. కానీ ఈ రోజు శ్రీను గారు దాన్ని దుర్వినియోగం చేశారు. 

తన పదవిని చూసుకుని, ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బును చూసుకుని అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు... కానీ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. కానీ కొంతకాలంగా ఏదో జరుగుతోందన్న విషయం ఇటీవల నాకు అర్థమైంది. 

ఆయనకో చెడు అలవాటు ఉంది. తన సమస్యలను ఆయన ఎవరితోనూ పంచుకోరు. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకునే మనస్తత్వం ఆయనది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. 

మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకమ్మాయి పెళ్లీడుకు వచ్చింది. ఇక  ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

పిల్లల పేరు మీద, నా పేరు మీద ఆస్తులు రాయాలని నేను కోరుకోవడంలేదు. నేను, మీరు, పిల్లలు ఒకే ఇంట్లోనే కలిసి ఉందాం... మీరు బయటికి వెళ్లి మీ వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైనా చేసుకోండి... మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు... మీరు మాతోనే ఉండండి... ఆ మేరకు ఒప్పంద పత్రం రాసుకుందాం అని శ్రీను గారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ దువ్వాడ వాణి స్పష్టం చేశారు.

Duvvada Srinivas
Duvvada Vani
Divvela Madhuri
YCP MLC
  • Loading...

More Telugu News