Revanth Reddy: రేవంత్ రెడ్డి పాలన పట్ల సర్వే ఫలితాలు... స్పందించిన కాంగ్రెస్ నేతలు

Congress leaders responds on Survey results

  • కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆమోదించారన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ
  • తెలంగాణ ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందన్న మధుయాష్కీ
  • పరిమిత సమయంలో బాగానే పని చేశామన్న షబ్బీర్ అలీ

తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల 72 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారంటూ ఓ సర్వే వెల్లడించింది. 'అగ్ని న్యూస్ సర్వీస్' ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 మధ్య సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మెజార్టీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సర్వేపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ స్పందన

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, మంత్రివర్గం పాలనను తెలంగాణ ప్రజలు ఆమోదించారన్నారు. హైదరాబాద్ అందరికీ చాలా ముఖ్యమైన నగరమని, దానిని ప్రపంచస్థాయి నగరంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. 

సర్వేపై మధుయాష్కీ స్పందన

తమ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అధిష్ఠానం కూడా చెబుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం... రెండూ ముఖ్యమే అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే తమ ముందున్న కీలక అంశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ టీమ్ వర్క్ వల్లే ఇది (ప్రజా సానుకూలత) సాధ్యమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదని మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమకు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉందన్నారు. కేబినెట్ మంత్రుల సహకారంతో రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందన్నారు. ఈ క్రెడిట్ కేవలం ఒక వ్యక్తిది కాదన్నారు. కెప్టెన్‌కు రావాల్సిన క్రెడిట్ ఆయనకు వస్తుందని, అదే సమయంలో కోచ్‌కు రావాల్సిన క్రెడిట్ కోచ్ కు వస్తుందన్నారు. పాలన కూడా క్రికెట్ ఆట వంటిదేనని అభిప్రాయపడ్డారు. కోచ్, కెప్టెన్, బ్యాట్స్‌మెన్, బౌలర్లు... ఇలా ఇదో క్రికెట్ జట్టు అని భావించవచ్చునన్నారు.

షబ్బీర్ అలీ స్పందన

చాలా తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్ సభ ఎన్నికలు వచ్చాయని, దీంతో ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఎనిమిది నెలల కాలంలో తమ ప్రభుత్వం పని చేయడానికి పరిమిత సమయమే దొరికిందన్నారు. ఈ సమయంలోనూ ప్రజలను ఆకట్టుకునేలా పనిచేశామన్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలు ఇబ్బందులు పడినట్లు చెప్పారు. తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంపు వంటి హామీలను అమలు చేశామని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.

తమ ప్రభుత్వంలో మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాల ప్రజలకూ ప్రయోజనం చేకూరిందన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం అన్నారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. 

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కూడా నెరవేర్చిదిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఈ ఏడాదిలో మరో 30 నుంచి 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

సర్వేపై బల్మూరి వెంకట్

ప్రభుత్వం పనితీరుపై మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉండటం ఆనందాన్ని ఇచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి నాయకత్వానిదే అన్నారు. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పంటల రుణమాఫీని అమలు చేయడం అంత తేలికైన విషయం కాదన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి శ్రీధర్ బాబు చురుగ్గా వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటోందన్నారు. పరిపాలనలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదన్నారు. ప్రజల ప్రయోజనాలు ఆలోచించకుండా... ఒకే వ్యక్తి గతంలో నిర్ణయాలు తీసుకునేవాడన్నారు. అందుకే కాళేశ్వరం వంటి ప్రమాదాలు జరిగాయన్నారు.

  • Loading...

More Telugu News