Files Burning: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ఫైళ్లు దగ్ధం...! ఫైళ్లలో కీలక సమాచారం...!
- ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దగ్ధం
- తాజాగా పోలవరం ఎడమ కాలువ ఫైళ్లు దగ్ధమైనట్టు గుర్తింపు
- విచారణ జరిపిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ భూసేకరణకు చెందిన ఫైళ్లు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైనట్టు గుర్తించారు.
ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దగ్ధమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే... ఇప్పుడు పోలవరం ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలోని వారే ఈ ఫైళ్లను తగులబెట్టి ఉంటారన్న ప్రాథమిక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పోలవరం భూ సేకరణ, లబ్ధిదారులకు పరిహారం, తదితర ప్రాజెక్టు సంబంధిత అంశాల పూర్తి సమాచారం ధవళేశ్వరంలోని ఈ పరిపాలనా కార్యాలయంలోనే ఉంటుంది. భూ సేకరణకు సంబంధించి, పరిహారానికి సంబంధించి గతంలో ఈ కార్యాలయం వద్దకు లబ్ధిదారులు రావడం, ఆందోళనలు తెలపడం కూడా జరిగింది.
అలాంటి చోట ఫైళ్లు తగలబడిన నేపథ్యంలో... స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి కూడా ఈ ఘటనపై విచారణ జరిపారు. కాలిపోయిన ఫైళ్లను పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఫైళ్లుగా గుర్తించారు.
కాగా, లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటికి వస్తాయనే కాల్చివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం పోలీసులు పోలవరం ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ ఫైళ్లు తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.