Skill University: దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీలో బోధన ప్రారంభం: సీఎస్ శాంతికుమారి
- స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాలు, కోర్సులపై సీఎస్ సమీక్ష
- ప్రస్తుతం తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తామని వెల్లడి
- స్కిల్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం కానున్నట్లు వెల్లడి
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభిస్తామని, ఆ తర్వాత క్రమంగా దాదాపు 20 కోర్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.
స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాలు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకు తాత్కాలిక భవనంలో తరగతులను నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, నాక్ లేదా నిథమ్ కాలేజీల్లో తరగతులను నిర్వహిస్తామన్నారు. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్, డిప్లోమా కోర్సులను ప్రారంభిస్తామన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. డాక్టర్ రెడ్డీస్, అదానీ, సీఐఐ వంటి ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కానున్నట్లు తెలిపారు. ఆయా కంపెనీలు పలు విభాగాలలో శిక్షణ ఇస్తాయన్నారు.