Harish Rao: తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి?: హరీశ్‌రావు ఫైర్
- రైతు రుణమాఫీ వ్యవహారంతో సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత
- హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తల ప్రయత్నం
- దాంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం
- ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
రైతు రుణమాఫీ వ్యవహారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
దాంతో వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే.. ఈ వివాదం ముదిరి ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు నినాదాలతో హోరెత్తించారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. వారిలో కొందరిని స్టేషన్‌కు కూడా తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటని, రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు.