Konda Surekha: కేటీఆర్ అహంకారం తగ్గలేదు... ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: కొండా సురేఖ హెచ్చరిక
మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కొండా సురేఖ
సోషల్ మీడియాలో క్షమాపణ కాదు... బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆయన తల్లి, సోదరి, భార్య, కూతురు కూడా మహిళలేనని మండిపాటు
మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా అహంకారం తగ్గినట్టుగా లేదన్నారు. మహిళలను అవమానపరిచే విధంగా అందరి ముందు మాట్లాడి... 'ఎక్స్' లో క్షమించండని రాయడం కాదని... తెలంగాణ ఆడబిడ్డలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన వ్యక్తి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అంటూ తాను యథాలాపంగా అన్నానని కేటీఆర్ ఈ రోజు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కన్నది ఓ మహిళ... తోడబుట్టింది... చేసుకున్న భార్య... కూతురు కూడా మహిళలేనని... అలాంటి వ్యక్తి తెలంగాణ మహిళలను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
కేటీఆర్ మాటల పట్ల యావత్ తెలంగాణ మహిళాలోకం బాధపడుతోందన్నారు. నిన్న మహిళలను కించపరిచి, ఈరోజు ట్వీట్ ద్వారా "సారీ" చెప్పడం చూస్తుంటే అందరిముందు చెప్పుతో కొట్టి... వెనుకాల క్షమాపణలు చెప్పినట్లుగా ఉందని విమర్శించారు. సోషల్ మీడియా ఫాలోవర్స్‌గా అంతా చదువుకున్న వారు, ఇంటలెక్చువల్స్ ఉంటారన్నారు. కానీ బస్సుల్లో ప్రయాణించేది గ్రామీణ మహిళలు... వారెవరూ సోషల్ మీడియా చూడరు... అలాంటి వారికి కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. కేటీఆర్ అహంకారపు మాటలు తగ్గలేదని విమర్శించారు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారన్నారు.